ప్రేమ, వాత్సల్యము   మరియు  స్వాభిమానము

                                                         ప్రేమ, వాత్సల్యము   మరియు  స్వాభిమానము

              సాయంకాలము  సమయము ఆరు గంటలు. ప్రతిరోజూ నేను వెళ్లే హోటల్ లో, చివరన ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని  టీ త్రాగుతూవు ఉన్నా.   అప్పుడే నా ఎదురుగా  వున్న టేబుల్ దగ్గరకు ఒక వ్యక్తి ,ఒక పాప వచ్చి కూర్చున్నారు.  అతడి వాలకం చూస్తే కూలి పని చేసుకొనేవాడిలాగా  కనిపించాడు. బట్టలు కూడా మురికిగా వున్నాయి. పాప మాత్రము మంచిగ ఉతికిన గౌను  వేసుకునివుంది.  తన ముఖము చాలా  ఆనందముగా మెరిసిపోతూ వుంది. హోటల్ నలుమూలల చూస్తూ  కుషన్  కుర్చీ పైన కూర్చొని పైన తిరుగుతున్న ఫ్యాన్ నుంచి వచ్చే చల్లటి గాలిని  ఆహ్లాదిస్తూ కనిపించింది. నేను కూడా కుతూహలంగా వారివైపే  చూస్తూ  నెమ్మదిగా  టీ త్రాగుతున్నాను .

              వెయిటర్ వచ్చి రెండు గ్లాసులలో  మంచినీళ్ళు  పెట్టి ఏమి కావాలని అడిగాడు.  అతను  ఒక దోసె ఆర్డర్ చేసాడు. అది వినగానే పాప ముఖము ఇంకా ఆనందంతో వెలిగిపోయింది . కొద్దిసేపటి తరువాత వేడి వేడి దోస,సాంబారు ,చట్నీ తీసుకొని వచ్చాడు వెయిటర్.  పాప ఎంతో  ఇష్టంగా  దోస తింటూవుంటే, అతను  పాపను చూస్తూ మంచినీటిని త్రాగుతున్నాడు. అంతలో అతని ఫోను  రింగ్ అయింది . తన పాత  ఫోన్ తీసి ఇలా అన్నాడు. “ఈ రోజు పాప పుట్టిన రోజు ,తనని హోటల్ కు తీసుకొని వచ్చాను. క్లాసులో ఫస్ట్ వస్తే తన పుట్టిన రోజున హోటల్ కు తీసుకెళ్లి దోస తినిపిస్తానని మాట ఇచ్చాను.  అందుకే ఇలా తీసుకొనివచ్చాను. పాప  దోస తింటూంది .మరి నీవూ అని అడిగినట్లు ఉన్నాడు మిత్రుడు.   అరె  లేదురా, ఇద్దరం ఎలా తింటాము, అంతడబ్బులు ఎక్కడ వున్నాయి, నేను ఇంటికివెళ్ళి భోజనము  చేస్తాను అన్నాడు. వేడి టీ నాలుకకు చురుక్కుమనగానే  అతని మాటలను వింటున్న  నేను వాస్తవము లోకి  వచ్చాను.  పేదవాడైనా, ధనవంతుడైనా, తమ పిల్లల మోహంలో ఆనందాన్ని చూడటానికి  ఏమైనా చేస్తారు.  నేను లేచి కౌంటర్ దగ్గరకు వెళ్లి నా టీ డబ్బులు  మరియు  రెండు దోసెలకు డబ్బులు ఇచ్చి, ఆ టేబుల్ దగ్గరకు, ఇంకొక దోసె కూడా  పంపించండి. పొరపాటున కూడా ఉదారంగా ఇస్తున్నామని అనకండి. అతని  స్వాభిమానము  దెబ్బతింటుంది. అందుకు హోటల్  యజమాని  నవ్వుతూ ఆ తండ్రి, కూతురు ఈ రోజు మా అతిథులు. మీకు  ధన్యవాదాలు, వారిని గమనించి మాకు తెలియజేసినందుకు. వారికి సహాయము మమ్మల్ని చేయనివ్వండి. మీరు ఇంకెవరైనా సహాయపరులకు సహాయపడండి అన్నాడు.  

          నేను బయటనుంచి గమనిస్తూవున్నాను, మరొక  దోసె తెచ్చి అతని టేబుల్ మీద పెట్టాడు వెయిటర్. అతను  గాభరాగా  నేను ఒకటే ఆర్డర్ చేశాను అన్నాడు. అప్పుడు మేనేజర్ వచ్చి మీ పాప పుట్టిన రోజని, క్లాసులో ఫస్ట్ వచ్చిందని మీరు ఎవరితోనో అంటుంటే విన్నాను. పాపకు మా తరపున  ఇది బహుమానం.  ఇంకా మంచిగా చదవాలని, పాపతో అన్నాడు. అది చూసి పాప  తండ్రికి కళ్ళలో నీళ్ళువచ్చాయి.  చూసావా  తల్లీ , ఇలాగే  బాగా చదివితే, ఇంకా ఇలాంటివి ఎన్ని లభిస్తాయో  చూడు అన్నాడు.  హోటల్ యజమానితో ఇది  పార్సెల్ చేసిస్తే నేను ఇంటికి తీసుకెళ్లి, వీళ్ళ అమ్మతో కలిసి తింటాను, ఇలాంటివి ఆమె ఎప్పుడూ  తినలేదు అంటాడు. అందుకు  యజమాని, మీ ఇంటికొరకు ఇంకా మూడు దోసెలు,మిఠాయి డబ్బా వుంచాను ఇంటికి వెళ్లి మీ పాప  పుట్టినరోజు బాగా జరుపుకోండి , మీ వీధిలోని పిల్లలకు కూడా మిఠాయిలు పంచిపెట్టు అన్నాడు.  ఆ మాటలు విన్ననాకు పూర్తి విశ్వాసము  వచ్చింది, మంచి పనిచేయడానికి ఎక్కడపడితే అక్కడ దారి వుంది, మనము అడుగు ముందుకు వెయ్యాలి అంతే . ఒకరికి ఇచ్చినంత మాత్రాన మనకు ఏమి తక్కువ కాదు, పైగా  దానికి రెట్టింపు దొరుకుతుంది . ఆ ఆనందము మనస్సు కు ఎంతో  ఆరోగ్యాన్ని,ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇచ్చి చూడండి మీకే తెలుస్తుంది, కానీ గొప్పలకు పోయి దానం చేయకండి. మనము ఎవరికి సహాయం చేస్తున్నామో, వారు అందుకు అర్హులుగా ఉండాలి, అపాత్ర దానము  మంచిది కాదు.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *