చిన్ననాటి    స్మృతులు

                                                                                   చిన్ననాటి    స్మృతులు

             ఒక్క ముచ్చటైన  కుటుంబము.   అందులో నాయనమ్మ, తాతయ్య, కొడుకు, కోడలు, మనవడు వుంటారు ,  మనవడి పేరు చింటూ . వయస్సు 8 సంవత్సరాలు .  ఒక రోజు  చింటూ నాయనమ్మ దగ్గరకి వచ్చి నానమ్మా ! చిన్నప్పుడు మా నాన్న కు ఏ స్వీట్ ఇష్టము అని అడిగాడు . అన్ని ఇష్టమే కానీ బందరు  లడ్డు చాలా ఇష్టముగా తినేవాడు  అంది . చింటూ గోము గా అయితే  ఇప్పుడు చెయ్యి నానమ్మ అని అడుగుతాడు . ఆమె భర్త  కూడా చెయ్యవే ,నాకూ  తినాలనివుంది అంటాడు .. నాకు సహాయము చెయ్యాలి మరి అని మనవడిని వంటింట్లోకి  తీసుకెళ్లి లడ్డులు  తయారుచేస్తుంది. సాయంకాలము ఇంటికి వచ్చిన కొడుక్కి బందరు  లడ్డు  తినిపిస్తుంది తల్లి .  ఏంటమ్మా !ఈ రోజు బందరు  లడ్లు  చేసావు, అబ్బా ! ఎన్ని రోజులు అయింది తిని,  అని తల్లి వైపు సంతోషముగా చూస్తాడు, ఇంకా మా నాన్న కు ఏమి ఇష్టము  నానమ్మా అని అడుగుతాడు .  తలకు నూనె  నేను అంటితే చాలా ఇష్టము  మీ  నాన్నకు. అయితే  ఇప్పుడు నాన్నకు తల  అంటండి అంటాడు  చింటూ .   ఆమె కొడుకును పిలిచి  తలకు నూనె అంటుతూవుంటే చింటూ కూడా తన తల్లిని పిలిచి తనకు కూడా అలానే  నూనె  అంటమంటాడు . చింటూ తండ్రికి తన చిన్ననాటి స్మృతులు గుర్తుకొచ్చి తల్లి వైపు ఆప్యాయంగా చూస్తాడు. ఆమె కూడా చాల ఆనందిస్తుంది.  

             మరు నాడు చింటూ తాతయ్య దగ్గరకు  వెళ్లి, తాతయ్యా ! నాన్న నీతో చిన్నప్పుడు ఎలా  ఉండేవారు అని అడుగుతాడు.  ఆయన నవ్వుతూ మీ నాన్న  నాతో  బలపరీక్షకు  దిగేవాడు. నేను  తమాషాగా ప్రతిసారి ఓడిపోయేవాడిని. అదిచూసి మీ నాన్న చాలా  సంతోషపడేవాడు. అయితే   ఇప్పుడు చెయ్యండి,  కానీ మీరు ఓడిపోకూడదు అంటూ తండ్రి దగ్గరకు తీసుకొచ్చి తాతను బలపరీక్ష చెయ్యమంటాడు .  సరదాగా తండ్రీ కొడుకు మోచేతిని వంచి బలపరీక్ష కు దిగుతారు.  అతనికి తన చిన్నతనము జ్ఞాపకము  వస్తుంది.  తన తండ్రి దగ్గర  అతను  ఓడిపోతాడు .  అది చూసి చింటూ సంతోషముతో గంతులు వేస్తాడు.

           చింటూ తండ్రి ఆఫీసుకు తయారై  తన బూట్లు కనబడక పోయేసరికి భార్యను అడుగుతాడు. సరిగ్గా చూడండి, స్టాండ్ లోనే  వున్నాయి అంటుంది ఆమె. అప్పుడు తాత, మనవడు వస్తారు. తండ్రి చేతి లోని పాలిష్ చేసిన బూట్లు చూడగానే, మీరు ఎందుకు చేసారు నాన్న అని అడుగుతాడు.  ఆయన నవ్వుతూ నీకేమైనా గుర్తుకువచ్చిందా అని అడుగుతాడు.  ఏమిటి  నాన్న ఇదంతా ,బందరు
 లడ్డు, తలంటడం , బలపరీక్ష, అన్నీ అని అడుగుతాడు. వారు నవ్వుతూ మనవడి  వైపు చూస్తారు . చింటూ వైపు తిరిగి ఇదంతా  నీ నిర్వాకమా, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాడు. పిల్లాడు  నీళ్లు  నములుతూ, ఎందుకంటే నాన్నా మీరు, మీ చిన్ననాటి స్మృతులు ,తాతయ్య,నాయనమ్మ మీకొరకు ఏమేమి చేసారో ,అవి అన్ని మరచిపోకూడదని . నేను ఎందుకు మరచిపోతాను, అవన్నీ నా మధుర స్మృతులు అంటాడు తండ్రి.  మరీ  నా స్నేహితుడి నాన్నగారు అన్నీ మరచిపోయి వారి తల్లితండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆలా మీరు కూడ చేస్తారేమో అని ,ఇదంతా చేశాను నాన్న అంటే, ఆ తండ్రి ఏమి మాట్లాడాలో  తెలియక అలాగే నిలబడి పోతాడు.  అప్పుడు వారి కోడలు బాబూ ! ఒకవేళ మీ నాన్నకు ఆ ఆలోచన వచ్చినా, నేను మాత్రము  మీ తాతయ్య, నాన్నమ్మలని  వృద్ధాశ్రమంలో చేర్పించను  అని కొడుకును ముద్దాడుతుంది.

           ప్రతి కొడుకు, కోడలు చింటూ తల్లి తండ్రి లాగా ఆలోచిస్తే, ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు తమ  చిన్ననాటి స్మృతులను మరచిపోకుండా, తల్లి తండ్రి తమను ఎలా పెంచారు అని ఆలోచించాలి. 

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *