అందమైన నర్స్
ఒక యువకుడు తన తండ్రి కొత్తగా కొనిచ్చిన బండి డ్రైవింగ్ చేసుకుంటూ కాలేజ్ కి వెళ్తున్నాడు.
ఎదురుగా ఒక హాస్పిటల్ నుండి బయటకు వస్తున్న నర్స్ కనిపించింది. ఆ అమ్మాయి అందం చూసి మనసు పారేసుకున్నాడు. వెంటనే తన గుండె వేగంగా కొట్టుకుంది. బహుశా ప్రేమంటే ఇదేనేమో..
తన ఎడమ వైపు మెల్లగా నడుస్తున్న అమ్మాయిని చూస్తూ చొంగ కారుస్తున్నాడు కానీ, తన ముందు వైపు వేగంగా దూసుకు వస్తున్న లారీని చూసుకోలేదు. దెబ్బకు డాష్ ఇచ్చింది లారీ. ఎలాగో హాస్పిటల్ పక్కనే పడ్డాడు కదా! స్ట్రెచర్ తెచ్చి లోపలికి తీసుకుని వెళ్లారు తనని .
కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అదే అందమైన నర్స్. కిందకు చూస్తే కట్లు.
“మీకు రోడ్డు ప్రమాదంలో దెబ్బలు బాగా తగిలాయి. అందుకే ఒళ్ళు అంతా కట్లు కట్టాం. మీరు ఇక్కడ అడ్మిట్ అయ్యి వారం రోజులు అయింది. ఇన్నిరోజులూ మీకు స్పృహ లేదు. మీకు ఒక చిన్న ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకొన్ని రోజులలో మీరు కోలుకుంటే డిస్చార్జ్ చేస్తాం. మీకు ఏ సహాయం కావాలన్నా ఈ నర్స్ ని అడగండి” అని చెప్పాడు తనను చూడటానికి వచ్చిన డాక్టర్.
“హమ్మయ్యా! యాక్సిడెంట్ అయితే అయింది కానీ.. ఆ నర్స్ ని రోజూ చూడొచ్చు. ఇప్పుడు తనతో సేవ చేయించుకునే భాగ్యం కూడా దక్కింది. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది?” అనుకున్నాడు మనసులో.
హాస్పిటల్లో తనను చూడటానికి వచ్చిన తన స్నేహితులకి కూడా తన మనసులో మాట చెప్పాడు.
“కంగ్రాట్స్ మామా! నీ పోరి బాగుంది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు, యాక్సిడెంట్ దెబ్బకు నీ పోరి పని చేస్తున్న హాస్పిటల్ లో వచ్చి పడ్డావ్. డిస్చార్జ్ అయ్యేలోపు ఆ పోరిని పడేసి మాకు పార్టీ ఇచ్చేయ్. ఏమైనా సహాయం కావాలంటే, మాకు ఒక ఫోన్ కొట్టు చాలు.” అన్నారు.
వాళ్ళ ప్రోత్సాహం తో ఇంకా రెచ్చిపోయాడు. రోజూ ఆ నర్స్ వచ్చే సమయానికి పళ్ళు ఇకిలించడం, తన స్నేహితులకు ఫోన్ చేసినట్టు నటించి పెద్ద ధనవంతుడిలా బిల్డప్ ఇవ్వడం చేసేవాడు.
ఒక రోజు తన మాటలు విన్న ఆ నర్స్, తనను చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది.
ఆ నర్స్ నవ్వు చూసి ఆనందంతో డాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఒంటిపై కట్లు, వాటి నొప్పులు ఉండటం వల్ల, ఆ పని కుదరలేదు.
“గుంట ఫ్లాట్ రా మామా !” అని తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు ఆ నర్స్ పక్కకి వెళ్ళగానే.
“ఇంకేంటి మామా ! ప్రొసీడ్.. నీ ప్రేమ విషయం చెప్పేయ్” అన్నాడు ఒక స్నేహితుడు ఫోన్ లో .
“అప్పుడేనా! ఇంకొన్ని రోజులు బిల్డప్ ఇచ్చి, డిశ్చార్జ్ అయ్యే రోజు ప్రపోజ్ చేస్తా” అన్నాడు ఆ యువకుడు.
“ఎంత త్వరగా ప్రపోజ్ చేస్తే అంత మంచిది. తనకు ఎవరైనా బాయ్ ఫ్రండ్స్ ఉన్నారో.. తను ముందే ఎవరితోనైనా లవ్ లో ఉందో.. నీకు తెలియదు కదా”
“ఛా! ఊరుకోరా!! నువ్వూ.. నీ యెదవ డౌట్లు.. నాకు ఇంత మంచి అమ్మాయి దొరికిందని మీకు కుల్లు. తనని చూస్తే చాలా మంచి అమ్మాయిలా ఉంది. తన అందమైన ముఖం చూస్తే అర్ధం అవుతుంది ఎంత అమాయకురాలో అని… అసలు అమాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది అనుకో.”
“నీ ఇష్టం రా! బెస్ట్ ఆఫ్ లక్”
“థాంక్యూ రా! వచ్చే శనివారం డిశ్చార్జ్..
అదేరోజు ప్రపోజ్ చేస్తా!
ఆదివారం పార్టీ!
సోమవారం ఎంగేజ్మెంట్!
మంగళవారం పెళ్లి!
బుధవారం… ”
“ఇంక ఆపు రా బాబూ.. ” అని తన ఫ్లో కి ఫోన్ లోనే అడ్డుకట్ట వేశాడు స్నేహితుడు
“సరే సరే.. నా నర్స్ పాప వస్తుంది. బాయ్ !” అని ఫోన్ కట్ చేసాడు ఆ యువకుడు.
తర్వాతి శనివారం.. డిస్చార్జ్ అయ్యాడు.
“ఆరోగ్యం జాగ్రత్త బాబూ! ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. అవసరం అయితే మళ్ళీ మన హాస్పటల్ కి తప్పకుండా రావాలి” అని అనునయంగా చెప్పాడు డాక్టర్.
“ఎందుకు రానూ? ఇది మన హాస్పటల్ కదా! తప్పక వస్తా!” అన్నాడు ఆ యువకుడు.
“నాకు పెళ్లి అయితే, నా నర్స్ పెళ్ళాం ఇక్కడే పని చేస్తుంది కదా! అప్పుడు తనని దింపడానికి రోజూ రావాలి. పాపం! ఈ డాక్టర్ కి ఆ విషయం తెలియదు” అని నవ్వుకున్నాడు మనసులోనే.
నిజానికి డాక్టర్ చెప్పినట్టుగానే, లోపల నొప్పులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. కానీ, తన ప్రేమ తెలియజేయాలి అని గుండె వేగంగా కొట్టుకుంటుంది.
”ఆ ప్రేమ నొప్పి కంటే, ఈ నొప్పి పెద్ద నొప్పి కాదులే” అనుకున్నాడు.
నర్స్ దగ్గరకు వెళ్లి చెప్పాడు “మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే పడిపోయాను. మీరు నా మనసు దోచుకున్నారు. ఇప్పుడు నా హృదయం మీ దగ్గరే ఉంది” అని..
మొదటి సారి నోరు విప్పి తనతో మాట్లాడబోయింది ఆ అందమైన నర్స్.
ఆ పలుకులు దొర్లితే ఏరుకోవడానికి సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు ఆ యువకుడు
“అయ్యో! మేము దోచుకుంది మీ గుండె కాదు.. మీ హృదయం కాదు..
నిజానికి మేము దోచుకున్నది మీ కిడ్నీ మాత్రమే….
అది కూడా ఇప్పుడు మా దగ్గర లేదు. మీకు ఆపరేషన్ చేసిన వెంటనే మంచి డబ్బున్న పార్టీ దొరికితే, పది లక్షలకి అమ్మేసాం” అని చెప్పి నాలుక కర్చుకుంది ఆ నర్స్.
నీతి: మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి